పెరిగిన భూముల విలువ

పెరిగిన భూముల విలువ
హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి పథంలో దూసుకు పోతోంది.
రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ) ఇటీవల నిర్వహించిన వేలంలో రాయదుర్గంలోని నాలెడ్జ్ సిటీలో ఏకంగా ఎకరా భూమి 177 కోట్ల రూపాయలు పలికింది. వేలం వేసిన మొత్తం 7.67 ఎకరాల భూమికి 1,357 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. ఈ వేలంతో తెలంగాణలో భూమి విలువ కొత్త మైలురాయి నమోదు చేసింది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంపై పెట్టుబడి దారులకు గల అపారమైన విశ్వాసానికి ఇది నిదర్శనంగా నిలిచింది. మరోవైపు, రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని, భూములు కొనేవారే లేరని ప్రచారం చేసేవారికి తగిన సమాధానం చెప్పినట్లయింది.
అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ, పెరుగుతున్న జనాభా, రియల్ ఎస్టేట్ కోసం పెరిగిన డిమాండ్ వంటి కారణాలు సాధారణంగా భూముల ధరలు పెరగడానికి కారణమవుతాయి. భూముల ధరలు పెరగడం వల్ల రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందుతుంది. ఇది మొత్తం ఆర్థిక వృద్ధికి దోహదంచేస్తుంది. భూ యజమానులు తమ ఆస్తుల విలువ పెరగడం వల్ల ఆర్థికంగా ప్రయోజనం పొందుతారు.
హైదరాబాద్ నగరంలో భూముల విలువ పెరగడానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు ప్రధాన కారణం. హైదరాబాద్ నగరాభివృద్ధికి ప్రభుత్వం ఏటా దాదాపు 10 వేల కోట్ల రూపాయలు ఖర్చుచేస్తోంది. గడచిన రెండేళ్ళలో చేపట్టిన అభివృద్ధి పనులు ఇప్పుడిప్పుడే ఫలితాలనివ్వడం ప్రారంభించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *